Friday, November 6, 2009

టాక్ షొ తల్లులు

మీలో ఎంతమంది తెలుగు టీవి చూస్తారో తెలియదు కాని.. చూడక పోతే మాత్రం, మీరు ఏమీ మిస్ కావడం లేదు. వారమంతా తెగ పనిచేసి అలిసిపోయను కాస్త కాలక్షేపంగా వుంటుంది అని నిన్న ఆదివారం కాసేపు "బుల్లి తెర" తీసా...అంతే... ఎప్పుడూ కంపు కొట్టె రాజకీయ వార్తలు, ఫలనా సినిమా తార కి ఫలనా దర్శకుడికి మధ్య ఏదో ఉందని పదే పదే చెపుతూ, ఆ విషయం పై మీ అభిప్రాయం మా స్టూడియో కి ఫోన్ చేసి చెప్పండి అని పదే పదే ప్రాణాలు తోడేసే సినిమా వార్తలు, ఒబామాకి నోబుల్ శాంతి బహుమతి రావడం మీ శ్రీమతికి సమ్మతమేనా అని ప్రశ్నించే అంతర్జాతీయ వార్తలు, ఆముదాలవలసలో జరిగిన అన్యాయం అంటూ "ఎలుకను తిన్న పిల్లి" శీర్షిక తో క్రైం(నేర) వార్తలు.. ఇలా మీకు ఓపిక ఉండాలేగాని.. ఆ బుల్లి తెర మన తెలుగు చానల్స్ పుణ్యమా అని తన పేరుని(ఇడియట్ బాక్స్) సార్థకం చేసుకుంటొంది. ఇక.. ఆయా కార్యక్రమాలలో తెంగ్లిష్ మాట్లడుతూ.. అటు తెలుగు ఇటు ఆంగ్లం(ఇంగ్లీష్)సరిగా రాని "ఏంకరమ్మలు", "నా ఖర్మకాలి నెను మీకు ఇలా టీవీ లో కనిపిస్తున్నానుగాని నా అంత అందగాడు ఈ భూపెపంచకంలో లేడు" అని మురిసి ముక్కలయ్యే "ఏంకరయ్యలు", వీళ్ళందరినీ మించి నోటికొచ్చినదంతా వాగుతూ తమను తాము ఓప్రా వింఫ్రే కి పోటీగా భావించే "టాక్ షో తల్లులు" నన్ను ఈ వ్యాసం రాయడానికి పంపారు. ప్రస్తుతానికి నన్ను బాగా ఆకట్టుకున్న(గొంతు పట్టుకున్న అంటే బాగుంటుందేమో) టాక్ షో తల్లుల మహాత్మ్యం మీకు చెప్పాలి. ముఖ్యంగా ఒక ఇద్దరు తల్లులు నాకు జ్ఞానోదయం చేసారు ..

మొదటగా! అద్భుతమైన ఆపాత మధుర గీతాలను రీమిక్స్ పేరుతొ పాతరేసి, అతితక్కువ బట్టలతో ప్రచార వీడియోలు రూపొందించి జనానికి కిర్రెక్కించిన ఒక సుందరి... ఛానల్ పేరు గుర్తులేదుకాని "ముస్తఫా ముస్తఫా" పేరుతొ ఈవిడ ఒక టాక్ షో అనే కార్యక్రమం నడిపిస్తోంది.. తన పాత గుర్తింపు తో(అబ్బా అదేనండి.. తక్కువ బట్టలు..వెకిలి నవ్వు.. గట్ర..గట్రా!!)ఆ కార్యక్రమం ఎవరిని అలరిస్తోందో మీకు నేను చెప్పనక్కరలేదనుకుంటా. కావాలంటే మీరే ఒక్క సారి ఆ కార్యక్రమం చూడండి(పెళ్ళైన మగవారికి గమనిక: ఆ ప్రోగ్రాం చూసెప్పుడు మీ శ్రీమతి చుట్టుపక్కల లేకుండా జాగ్రత్త పడండి, లేకపొతే మీ శ్రీమతి తిట్ల పురాణానికి ఆ సుందరి తో పాటు మీరు కూడ బలైపోగలరు.)

(ఇంకా వుంది...)